Jump to content

మిల్టన్ ఫ్రీడ్‌మన్

వికీపీడియా నుండి
మిల్టన్ ఫ్రీడ్‌మన్

మిల్టన్ ఫ్రీడ్‌మన్ (జూలై 31, 1912 - నవంబర్ 16, 2006) అమెరికాకు చెందిన ఆర్థికవేత్త. 1912లో అమెరికాలో జన్మించాడు. చికాగో, రట్గర్స్ విశ్వవిద్యాలయాలలో విద్యనభ్యసించి, 1946లో చికాగో విశ్వవిద్యాలయంలోని అర్థశాస్త్ర విభాగంలో ప్రవేశించాడు. వినియోగ విశ్లేషణ, ద్రవ్య సిద్ధాంతాలపై పరిశోధించి 1976లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాడు.[1] ఇతని ప్రముఖ రచనలు క్యాపిటలిజం అండ్ ట్రేడ్, ఎ మానిటరీ హిస్టరీ ఆఫ్ యుఎస్ (1867-1960)

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

ఫ్రీడ్‌మన్ 1912 జూలై 31 న న్యూయార్క్ లోని బ్రూక్లిన్లో జన్మించాడు. అతని తల్లిదండ్రులు సారా ఎథెల్, జెనే సాల్ ఫ్రీడ్‌మన్. [2] వీళ్ళు కార్పాతియన్ రుథేనియా, హంగేరి రాజ్యం లోని బెరెగ్స్జాజ్ (ఇప్పుడు ఉక్రెయిన్‌ లోని బెరెహోవ్) నుండి వలస వచ్చిన యూదులు. వారిద్దరూ పొడి వస్తువుల వ్యాపారం చేసేవారు. అతను పుట్టిన కొద్దికాలానికే, కుటుంబం న్యూజెర్సీలోని రాహ్వేకు మకాం మార్చింది. తన టీనేజ్ వయస్సులో, ఫ్రీడ్‌మన్ కారు ప్రమాదంలో గాయపడ్డాడు. అతని పెదవిపై గాటు పడింది. [3] [4] ఫ్రీడ్‌మన్ ప్రతిభావంతుడైన విద్యార్థి. అతడు తన 16 వ పుట్టినరోజుకు ముందు 1928 లో రాహ్వే హై స్కూల్ నుండి పట్టభద్రుడయ్యాడు. [5] [6] అతనికి రట్గర్స్ విశ్వవిద్యాలయానికి పోటీ స్కాలర్‌షిప్ లభించింది (అప్పట్లో అది న్యూజెర్సీ రాష్ట్రపు పరిమిత మద్దతు పొందిన ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం).

1932 లో, ఫ్రీడ్‌మన్ రట్గర్స్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు, అక్కడ అతను గణితం, ఆర్థిక శాస్త్రాల్లో నైపుణ్యం పొందాడు. ప్రారంభంలో ఒక యాక్చువరీగా[నోట్స్ 1] పని చెయ్యాలని అనుకున్నాడు. రట్గర్స్‌లో ఉన్న సమయంలో, ఫ్రీడ్‌మన్ ఆర్థర్ ఎఫ్. బర్న్స్, హోమర్ జోన్స్ అనే ఇద్దరు ఎకనామిక్స్ ప్రొఫెసర్ల చేత ప్రభావితుడయ్యాడు. ఆధునిక ఆర్థిక శాస్త్రం మహా మాంద్యాన్ని అంతం చేయడంలో సహాయపడుతుందని వాళ్ళు అతడి చేత ఒప్పించారు.

రట్గర్స్ నుండి పట్టా పొందిన తరువాత, ఫ్రీడ్‌మన్‌కు గ్రాడ్యుయేట్ చేయడానికి రెండు స్కాలర్‌షిప్‌లు వచ్చాయి. ఒకటి బ్రౌన్ విశ్వవిద్యాలయంలో గణితంలోను, మరొకటి చికాగో విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలోనూ. [7] ఫ్రీడ్‌మన్ రెండోదాన్ని ఎంచుకున్నాడు, తద్వారా 1933 లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందాడు. అతను జాకబ్ వినెర్, ఫ్రాంక్ నైట్, హెన్రీ సైమన్స్ చేత తీవ్రంగా ప్రభావితమయ్యాడు. చికాగోలో ఫ్రీడ్‌మన్ తన కాబోయే భార్య, ఆర్థికవేత్త రోజ్ డైరెక్టర్‌ను కలిశాడు. 1933-1934 విద్యా సంవత్సరంలో అతను కొలంబియా విశ్వవిద్యాలయంలో ఫెలోషిప్ పొందాడు. అక్కడ అతను ప్రఖ్యాత గణాంకవేత్త, ఆర్థికవేత్త హెరాల్డ్ హోటెల్లింగ్‌తో గణాంకాలను అధ్యయనం చేశాడు. అతను 1934-1935 విద్యా సంవత్సరంలో తిరిగి చికాగో వెళ్ళాడు. హెన్రీ షుల్ట్జ్ కోసం పరిశోధనా సహాయకుడిగా పనిచేశాడు. అతను అప్పుడు థియరీ అండ్ మెజర్మెంట్ ఆఫ్ డిమాండ్లో పనిచేస్తున్నాడు. ఆ సంవత్సరం, ఫ్రీడ్‌మన్ జార్జ్ స్టిగ్లర్, డబ్ల్యూ. అలెన్ వాలిస్‌లతో జీవితాంతం నిలిచిపోయే స్నేహాన్ని కలుపుకున్నాడు. [8]

ఉద్యోగ వ్యవహారాలు

[మార్చు]

ఫ్రీడ్‌మన్ రిపబ్లికన్ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్కు, కన్జర్వేటివ్ బ్రిటిష్ ప్రధాన మంత్రి మార్గరెట్ థాచర్‌కూ సలహాదారు. అతని రాజకీయ తత్వశాస్త్రం స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థ యొక్క ధర్మాలను కనీస జోక్యంతో ప్రశంసించింది. అమెరికాలో నిర్బంధ సైనిక శిక్షణను తొలగించడంలో తాను నిర్వహించిన పాత్ర తనకు గర్వకారణమని అతడు ఒకసారి పేర్కొన్నాడు. ఫ్రీడ్‌మన్ తన 1962 పుస్తకం కాపిటలిజం అండ్ ఫ్రీడం లో, స్వచ్ఛంద మిలిటరీ, స్వేచ్ఛగా ఉండే మారకపు రేట్లు, వైద్య లైసెన్సుల రద్దు, నెగటివ్ ఆదాయపు పన్ను, పాఠశాల వోచర్లు [9] వంటి విధానాలను సమర్థించాడు. మాదకద్రవ్యాలపై యుద్ధాన్ని వ్యతిరేకించాడు. పాఠశాలను ఎంపిక చేసుకునే విధానానికి అతడు పలికిన మద్దతు ఫ్రీడ్‌మాన్ ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషనల్ ఛాయిస్‌ను స్థాపించడానికి దారితీసింది. తరువాత దీని పేరును ఎడ్‌చాయిస్ అని మార్చాడు. [10]

నోట్స్

[మార్చు]
  1. రిస్కును, అనిశ్చితినీ లెక్కించే వ్యక్తి. ఈ శాస్త్రాన్ని యాక్చువరీ సైన్సు అంటారు. ఇన్స్యూరెన్సు కంపెనీలు తమ పాలసీలను రూపొందించడంలో యాక్చువరీలు ప్రముఖ పాత్ర పోషిస్తారు

మూలాలు

[మార్చు]
  1. Friedman, Milton. Encyclopædia Britannica. 2007. Encyclopædia Britannica Online. 9 Oct. 2007.
  2. "Who's who in American Jewry". 1980. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  3. Ebenstein 2007, p. 10
  4. Milton & Rose Friedman, Two Lucky People. Memoirs, Chicago 1998, p. 22.
  5. Eamonn Butler (2011). "Ch. 1". Milton Friedman. Harriman Economic Essentials.
  6. Ebenstein 2007, pp. 5–12
  7. "Milton Friedman and his start in economics". Young America's Foundation. August 2006. Archived from the original on February 23, 2013. Retrieved March 12, 2012.
  8. Ebenstein 2007, pp. 13–30
  9. "Milton Friedman (1912–2006)" Archived జనవరి 3, 2007 at the Wayback Machine. Econlib.org. Retrieved on September 6, 2017.
  10. Maureen Sullivan (జూలై 30, 2016). "Milton Friedman's Name Disappears From Foundation, But His School-Choice Beliefs Live On". Forbes. Archived from the original on సెప్టెంబరు 21, 2016. Retrieved సెప్టెంబరు 14, 2016.
  翻译: